Sunday, October 11, 2009

Floods - Price Rice Of Vegitables N Fruits



పండ్లు, కూరగాయలకు వరద పోటు

fruits


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: కరవు వెంట వచ్చిన వరదలతో పండ్లు, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా సాగవుతున్న ఆరు రకాల పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది. కర్నూలు, మహబూబ్‌నగర్‌, గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు అరటి, బత్తాయి, బొప్పాయి, సపోటా, జామ పంటలు బాగా దెబ్బతిన్నాయి. వీటితో పాటు ఉల్లి, టామాటా, మిరప పంటలు కూడా నీట మునిగాయి. దీంతో కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. బహిరంగ మార్కెట్‌లో, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల నుంచి స్వతహాగా మిగిలిన చోట్లకు వచ్చే అన్ని సరుకుల రేట్లను వ్యాపారులు వెంటనే పెంచేసి అమ్ముతున్నారు. అదేమని ప్రశ్నిస్తున్న సామాన్యులను వరదల వల్ల ఆయా జిల్లాల నుంచి కూరలు, పండ్లు, నిత్యావసరాల స్టాకు రావడం లేదని తేల్చేస్తున్నారు. కూరలు, నిత్యావసరాల కోసం ఇతర జిల్లాలపైనే ఆధారపడిన విజయవాడ, గుంటూరు నగరాల్లో ధరలు భారీగా పెరుగుతున్నాయి.

ఉల్లి ధరలకు కన్నీళ్లు

కర్నూలు జిల్లాపై వరదలు తమ ఉగ్రరూపాన్ని చూపడంతో ఉల్లి పంట పూర్తిగా నీట మునిగింది. రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాలకు కర్నూలు నుంచే ఉల్లి సరకు మార్కెట్‌లోకి వస్తుంది. అయితే అకాల వర్షాలతో ఈ సారి 16, 400 ఎకరాల్లో ఉల్లి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారిక అంచనా. ఎక్కువ రోజులు నీటిలో నానిపోవడంతో ఉల్లిగడ్డలు లోలోపలే కుళ్లిపోయాయి. వీటి వల్ల మార్కెట్‌లోకి సరకు రావడం లేదు. దీంతో వరదల ముందు వరకు రూ. 10 - 15 మధ్యనే ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో రూ. 24 వరకు ధర పలుకుతున్నాయి.

కూర‘గాయాలు’

రాష్ట్ర ప్రజల అవసరాలకు ప్రతీ నెలా 2 కోట్ల టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. అయితే తగ్గిపోతున్న కూరగాయల సాగు, కరువు, చీడపీడ సమస్యలు దృష్టిలో ఉంచుకుంటే వీటి దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఇప్పటికే మార్కెట్‌లో బెండ, దొండ, టమాటో, పచ్చి మిర్చి, కాకర, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ తదితర కూరగాయలు గత రెండు రోజుల్లోనే కిలోకు రూ. 2 లకు పైగా పెరిగాయి. గ్రామాల నుంచి సరకు రావడం కూడా తగ్గుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లి ధరలు ఇప్పటికే ఘాటెక్కగా మిగతా కూరగాయల రేట్లు కూడా క్రమంగా కొండెక్కుతున్నాయి. మరో వారంలో టమాట కేజీ రూ. 25 లు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో టమాటో సాగుకు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టం కలిగింది. సాధారణ సగటు విస్తీర్ణం 69 వేల హెక్టార్లు కాగా ఇది సగానికి సగం పడిపోయింది. వరదల కారణంగా ఇదే పరిస్థితి మరో రెండు వారాలు కొనసాగితే టమాట ధరలకు రెక్కలొచ్చే ప్రమాదముందని వ్యాపారులు అంటున్నారు.

అరటి పళ్లు డజను రూ. 25!

పేద వారికి సైతం అందుబాటులో చౌకగా దొరికే అరటి పండు ఇప్పుడు ఒక్కొక్కటి రూ. 3 లు ధర పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో డజనెక్కడా రూ. 25 లకు తగ్గడం లేదు. మన రాష్ట్రంలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీగా, కోస్తాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈ పంటను సాగు చేస్తున్నారు. మొత్తం మీద ప్రతీఏటా రాష్ట్రంలో 75 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అరటి సాగవుతోంది. సాధారణ పరిస్థితుల్లో అన్నీ బాగుంటే 26.31 లక్షల టన్నులు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది వాతావరణ అంత అనుకూలంగా లేకపోవడం, తెగుళ్లు తదితర కారణాల వల్ల అరటి సాగు విస్తీర్ణం, దిగుబడి 30 శాతం వరకు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాగు ఖర్చులు, శ్రమ ఎక్కువగా ఉండడంతో రైతులు అరటి అంటే అనాసక్తి చూపుతున్నారు. పంజాబ్‌, హర్యానా కు మన అరటి పండ్లు ఈ సీజన్‌లో ఇప్పటికే ఎగుమతి చేశారు. దీంతో రాష్ట్రీయ విపణిలో అరటి పళ్ల విక్రయాలు మండుతున్న ధరలతో సామాన్యుడికి మరింత ప్రియమవుతున్నాయి.

*వరదలకు పండ్లు, కూరగయ పంటలకు జరిగిన నష్టం
list1

list

No comments:

Post a Comment