Wednesday, October 21, 2009

Farmers Cry


To see the News Item - Click on the picture to Maximize..



హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: వరుస విపత్తులతో రైతులకు రోదనే మిగిలింది.
కరవు, వరదలకు విపరీతంగా నష్టపోయిన రైతులకిప్పుడు దిక్కుతోచడం లేదు.
అప్పులు తెచ్చిన సొమ్మంతా మట్టిలో కలిస్తే రబీలో మరో పంట వేసేదెలాగో
పాలుపోవడం లేదు. ప్రభుత్వం పంట నష్టం ప్రాథమిక అంచనాలు, ప్రకటనలు తప్ప
రైతు లెవరికీ పరిహారం ఇప్పటికీ అందలేదు. కరవు, వరదల వల్ల 30 లక్షల మంది
రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకదాని వెంట మరొకటిగా వచ్చిన
విపత్తులకు సుమారు 40 లక్షల ఎకరాల్లో పంటలు మట్టిపాలయ్యాయి. వీటిలో
జరిగిన భారీ నష్టానికి రైతులకు రూ. 674 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ
ఇవ్వాల్సి వస్తుందని ప్రాథమిక అంచనా.

ఇన్‌పుట్‌ సబ్సిడీ మాట అటుంచితే ఠంచనుగా అందాల్సిన పంటలబీమా జాడ లేదు.
రైతులకు బీమా పరిహారం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 800 కోట్లకు
పైగా ఇవ్వాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ వరకు రూ. 1200 కోట్ల మేర రైతులకు
రుణాలు ఇచ్చినా, కౌలు రైతులకు లక్ష్యాల మేరకు రుణాలు అందిన దాఖలాలు లేవు.
రాష్ట్రంలో ఈ ఏడాది జూన్‌ నుంచి కరవు విలయతాండవం చేస్తున్నా అధికారిక
ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో కేంద్ర సాయం రాలేదు. వెనువెంటనే
వచ్చిన వరద బీభత్సానికి రైతులు తేరుకోలేదు.



కరవుతో 23 లక్షల మంది రైతులకు కన్నీళ్లు

నాలుగు నెలల పాటు రాష్టవ్య్రాప్తంగా కరవు చేసిన విలయ తాండవానికి దాదాపు
23 లక్షల మంది రైతుల పంటలు 13, 55, 854 హెక్టార్లలో పూర్తిగా ఎండి
పోయాయి. కరవు వల్ల నష్టపోయిన రైతులకు రూ. 532 కోట్ల మేర ఇన్‌పుట్‌
సబ్సిడీ ఇంకా అందాల్సి ఉందని వ్యవసాయ శాఖ అంచనాలు చెబుతున్నాయి. అక్టోబరు
రెండవ వారంలోనే పూర్తిస్థాయి నివేదిక విడుదల చేయడంతో ఇంకా ఏ ఒక్క రైతుకు
కరవు వల్ల జరిగిన నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ కానీ పంట బీమా పరిహారం
కానీ అందలేదు.

రైతులకు అందించాల్సిన పరిహారం కోసం విపత్తు సహాయ నిధి (సిఆర్‌ఎఫ్‌) కి
పంట నష్టంనివేదికలు పంపామని, అక్కడి నుంచి నిధులు రాగానే రైతులకు
పెట్టుబడి రాయితీ అందుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కరవు
తరువాత వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన తమకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట బీమా
వీటిలో ఏదీ అందకుండా రబీలో పంటలు ఎలా వేయగలమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అసలు రాష్ట్రానికి విపత్తు సహాయ నిధి (సిఆర్‌ఎఫ్‌) పరిధిలో ఉన్న మొత్తం
రూ. 420 కోట్లు మాత్రమే. వీటిని కూడా రూ. 210 కోట్ల చొప్పున రెండు
విడతల్లో అత్యవసర సహాయ చర్యల కోసం ఖర్చు చేసేశారు.


పంట బీమాకు కేంద్రం తాత్సారం :

ఇక పంట బీమా పరిహారమైనా సకాలంలో అందుతుందేమోనని 7.5 లక్షల మం ది రైతులు
ఎదురు చూపులు చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో
అంతకంతకూ తాత్సా రం చేస్తోంది. కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
రఘువీరా రెడ్డి, సీఎం రోశయ్య చేస్తున్న విజ్ఞప్తులు ఫలితా లనివ్వడం లేదు.


కౌలుకు దుఃఖం :

ఈ సారి వరదలకు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువమంది కౌలు
రైతులకే నష్టం జరిగింది. మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 2 లక్షల ఎకరాల్లో
వీరు వేసిన పంటలు పూర్తిగా పోయాయి. దీంతో వీరందరూ అప్పులు తెచ్చిన భూమిలో
పోసి డబ్బులన్నీ వరదలకు కొట్టుకుపో యాయి. ఈ వరుస ప్రతికూల పరిణామాలతో
అక్కడి రైతులు ఒక్కసారిగా బిత్తరపోయారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకు
పోయిన వారు బలవర్మణాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.


సిద్ధం కాని అంచనాలు :

ఐదు జిల్లాల్లో వరద బీభత్సం వల్ల జరిగిన పంట నష్టం అంచనాలు ఇంకా సిద్ధం
కాలేదు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించి చేతులు దులుపుకుంది.
రెండు వారాల్లోగా ఈ నివేదికలు అందాల్సి ఉంది. కరవు ప్రకటనకు మూడు నెలల
పాటు జాప్యం జరగడంతో మనకు కేంద్రసాయం రాలేదు. దుర్భిక్షంపై అధికారిక
ప్రకటనలు చేసిన పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలకు ప్రధాని తక్షణం
స్పందించి ఒక్కొక్కరికీ రూ. 1000 కోట్లు సాయం అందించారు. ఇక కేంద్రం
నుంచి పరిశీలక బృందాలు రావడం ఆలస్యం కావడం వల్ల అనుకున్న ఫలితాలు వచ్చేలా
లేవు. ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకున్నట్లు లేకపోవ డంతో నష్టం తీవ్రత
తక్కువగా కనిపించే అవకాశ ముందని రైతులు సంఘాల నేతలు వ్యాఖ్యలు
చేస్తున్నారు. దీంతో కేంద్ర బృందాల వల్ల పెద్దగా ఒరిగేదేం కనిపించడం
లేదు.

No comments:

Post a Comment