Thursday, October 8, 2009

సమూల ప్రక్షాళన!

ఐఏఎస్ ల బదలీ యోచన
సిఎం పేషీలోకి కొత్త నీరు !
వైఎస్ సన్నిహిత వర్గ అధికారులకు చెక్

ROSAIAH-3

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలనా యంత్రాంగ సమూల ప్రక్షాళనకు పూనుకున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి తనకు పూర్తి మద్దతు ఉందన్న సంకేతాలు రోశయ్యకు ఇప్పటికే అందడంతో ఆయన స్వతంత్రంగా, తన దైన శైలిలో సమర్థవంతమైన పాలన అందించాలని ఉవ్విళ్లూరుతున్నారు. వైఎస్‌ వర్గానికి సన్నిహితంగా మసలుతున్న ఐఏఎస్‌ అధికారులకు పూర్తిగా చెక్‌ పెట్టనున్నారు. సి బ్లాక్‌లో అడుగుపెట్టాక ఇప్పటికే ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఎండి బ్రహ్మానంద రెడ్డి సస్పెన్షన్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మిపై బదిలీ వేటు వేయడం ద్వారా మార్పులు తప్పవనే సంకేతాలను రోశయ్య ఇప్పటికే పంపారు. ఈ మార్పులు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఉన్నతాధికారు లెవరూ తేరుకోకుండా రాష్ట్ర డిజిపి యాదవ్‌ సహా 5గురు ఐపిఎస్‌ల బదిలీలు చేసి ఎవరి ఒత్తిడులు, లాబీయింగ్‌లకైనా చెక్‌ పెట్టగలరని నిరూపించారు.

సమర్థవంతమైన పాలన అందించేందుకు ఐఏఎస్‌ల మార్పులపై కూడా దృష్టి సారించనున్నారు. ఈ మార్పులు మొదట సీఎం పేషీ నుంచే మొదలవుతాయని వార్తలొస్తున్నాయి. వైఎస్‌ హయాంలో పని చేసి ఇప్పుడు ఆయన వర్గానికి సన్నిహితంగా మెలుగుతున్న అధికారులం దరినీ తొలగిస్తారని తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సమర్థులైన అధికారులను సీఎం పేషీలోకి తీసుకోవాలనేయోచనలో ఉన్నారు. ఇదే కోణంలో సమూల మార్పులు కనుక జరిగితే పాల నపై రోశయ్య ముద్ర తథ్యమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సోనియా అభి నందనల తరువాత పూర్తిస్థాయి సీఎంగా స్వతంత్య్ర శైలిలో సమర్థ వంతమైన పాలన అందించే దిశగా రోశయ్య ప్రస్థానం సాగుతోంది.

సిఎం పేషీతోనే మొదలు...

ముఖ్యమంత్రిగా రోశయ్య పగ్గాలు చేపట్టాక సీఎం పేషీలోకి కొత్తనీరు రానుంది. సీఎం ఆంతరంగిక కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి పదవీ విరమణ, హెలికాప్టర్‌ దుర్ఘటనలో ఐఏఎస్‌ అధికారి సుబ్ర మణ్యం మరణంతో సీఎం పేషీలో 2 స్థానాలు ఇప్ప టికే ఖాళీగా ఉన్నాయి. మరో నెల తరువాత కార్యదర్శి భాను డిప్యుటేషన్‌ ముగుస్తుండడంతో సీఎం పేషీలో మూడవ ఖాళీ ఏర్పడుతుంది. వీరి స్ధానాల్లో కొత్త ఐఏఎస్‌లను ఎవరిని తీసుకురావాలనే దిశ లో సీఎం రోశయ్య, ఆయన సన్నిహితులు కసరత్తు మొదలుపెట్టారు.గతంలో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు పాటించిన సామాజికవర్గ కూర్పు అనుసారమే సీఎం పేషీలో మార్పులుండొచ్చని ఐఏఎస్‌ అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

సామాజిక వర్గాల ప్రాతిపదికన..

వైఎస్‌ హయాంలో మైనారిటీ, దళిత, బిసి, అగ్ర వర్ణ అధికారులు ఒక్కొక్కరిగా సీఎం పేషీ కూర్పు ఉంది. జన్నత్‌ హుస్సేన్‌ మైనారిటీల నుంచి, కార్యదర్శి సుబ్రమణ్యం దళిత వర్గం, కార్యదర్శి భాను బిసి సామాజిక వర్గం కాగా, ప్రభాకర్‌ రెడ్డి అగ్ర కులానికి చెందిన అధికారిగా సీఎం పేషీలో విధులు నిర్వహించారు. రోశయ్య చేసే మార్పులు కూడా ఈ కూర్పుకు అనుగుణంగానే సాగవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. సిఎంఓ భర్తీకి సంబంధించి అధికారుల సమర్థత,గత అనుభవాలు పలువురు అధికారుల పనితీరుపై సీఎం తన సన్నిహత వర్గాలతో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. సీఎం పేషీలోకి వచ్చే అధికారులుగా దినేష్‌ కుమార్‌, లవ్‌ అగర్వాల్‌, సివిఎస్‌కె శర్మ, ఐవైఆర్‌ కృష్ణారావు, కె రాజు, రెడ్డి సుబ్రమణ్యం తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి పేర్లతోపాటు మరికొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.

జన్నత్‌కు మరో అవకాశం?

ప్రస్తుతం ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జన్నత్‌ హుస్సేన్‌ కొనసాగించే సూచనలున్నాయి. సీఎం పేషీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు స్ధానాల్లోకి దళిత సామాజిక వర్గం నుంచి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాం బాబ్‌, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శులు శామ్యూల్‌/ రెడ్డి సుబ్రమణ్యం, గ్రామీణా భివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె రాజు పేర్లు వినిపిస్తున్నాయి. పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) సిఇఓగా పనిచేస్తున్న విజయ్‌ కుమార్‌ను కూడా సిఎంఓలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. స్వాతంత్య్ర సమరయోధుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య కుమారుడు కావడం ఆయనకు కలసి వస్తుందని భావిస్తున్నారు. ఇపుడు సీఎం పేషీలో కార్యదర్శులుగా కొనసాగుతున్న మాదిరెడ్డి ప్రతాప్‌, ఆర్‌ కె గోనెల లను కూడా మార్చాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రతాప్‌ ఐపిఎస్‌ అధికారి కావడంతో ఆయన్ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఐఏఎస్‌కు స్ధానం ఇవ్వనున్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment