Tuesday, January 13, 2009

అవసరం లేకున్నా ఆపరేషన్లు!

ఇదే 'ఆరోగ్య శ్రీ' ప్రత్యేకత
డబ్బు దండుకునేందుకే
పేదల ఆరోగ్యంతో ప్రైవేటు చెలగాటం

హైదరాబాద్‌, జనవరి 11 (మేజర్‌ న్యూస్‌):

`ఆరోగ్య శ్రీ' తో అందరికీ వైద్యం!.. అంటూ ఆర్భాటంగా సర్కార్‌ చేస్తున్న సర్కార్‌ అంతా ఇంతా కాదు. అయితే ఆ వంకతో రోగులకు అవసరమున్నా లేకున్నా ఆపరేషన్ల మాత్రంచకాచకా జరుగుతున్నాయి. జిల్లాల్లోని చాలా గ్రామాలు, చిన్న పట్టణాలలో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్య శ్రీ వచ్చాక ప్రతీ చిన్న సమస్యకు శస్త్రచికిత్సే వైద్యంగా భావించడం పెరిగిపోతోంది. పేదలు ఆరోగ్య శ్రీ కార్డులు పట్టుకుని ఆయా ప్రాంతాల్లో పేరొందిన ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లకు పరిగెడెతున్నారు. దీంతో కొందరు డాక్టర్లు అత్యాశకు పోయి అవసరమున్నా లేకున్నా రోగులకు శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే మందు లతో తగ్గిపోయే జబ్బులకు కూడా ఆపరేషన్లు చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నా యి. పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాలకు ప్రమాదం లేని చికిత్సలను ఎంచుకుని పేదప్రజల ఆరోగ్యంతో చెలగాటమా డుతున్నాయి. రోగుల ప్రాణాలకు ప్రమాదం లేకపోయినా ఇతరత్రా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఆరోగ్య శ్రీ కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో వెలుస్తున్న క్లినిక్‌లు, నర్సింగ్‌హోంల పాలిట కామధేనువుగా మారింది. ఆ మాటకొస్తే ఆరోగ్య శ్రీ చికిత్సల కోసమే కొన్ని ఆసుపత్రులు కూడా వెలిశాయి. వరంగల్‌లోని ఓ పేరొందిన ప్రైవేటు ఆసుపత్రిలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే 375 హిస్టరెక్టమీ (గర్భాశయం తొలగింపు) శస్త్ర చికిత్సలను అనుమతి లేకుండా చేశారు. ఆరోగ్య శ్రీ పేరు చెప్పి వచ్చే డబ్బు దండుకునేందుకు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

విచ్చలవిడిగా హిస్టరెక్టమీలు

గ్రామీణ మహిళలలో తలెత్తు తున్న సాధారణ సమస్య ఇంట్రా మెన్ట్రు్యవల్‌ బ్లీడింగ్‌ (తెల్లబట్ట) తో గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని భయపెట్టి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. 40 ఏళ్ల పైబడిన మహిళలకు మాత్రమే గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్సలు చేయాలన్న నిబంధనలున్నా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వీటిని బేఖాతరు చేస్తున్నాయి. వరంగల్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఈ మధ్య జరిగిన శస్త్రచికిత్సలన్నీ 30 ఏళ్ల లోపు స్త్రీలపై జరిగినవే. నార్మల్‌ డెలివరీలు పక్కకు నెట్టేసి ఇటీవలి కాలంలో కాన్పుకు `సిజేరియన్‌' చేయడం పరిపాటిగా మారింది. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌తో పాటు ఉత్తర కోస్తాలోని శ్రీకా కుళం తదితర జిల్లాల్లో ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఏ ఆసుపత్రిలోనైనా హిస్టరెక్టమీ ఆపరేషనుకు 8 వేల రూపాయలకు మించి ఖర్చు కాదు. ఈ జబ్బులకు రూ. 6 వేలకు కూడా నాణ్యమైన చికిత్స అందించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆరోగ్య శ్రీలో మాత్రం కార్పొరేట్లకు కూడా `గిట్టుబాటయ్యేలా' ఈ శస్త్రచికిత్సకు రూ. 30 వేలు ఇస్తున్నారు. దీంతో చిన్న చిన్న పట్టణాల్లోని నర్సింగ్‌హోంలు, ఓ మోస్తరు ఆసుపత్రులు విచక్షణారహితంగా ఆపరేషన్లు చేస్తున్నాయి. ఈ తరహా చికిత్సలు చేసినందుకు మూడు నెలల్లో రూ. 1.12 కోట్లు వరంగల్‌లోని ప్రైవేటు ఆసుపత్రి ఖాతాలో జమ అయ్యాయి. ఆరోగ్య శ్రీని తమ వ్యాపార అవసరాలకు హాస్పిటల్‌‌స ఎలా వాడుకుంటున్నాయో ఇదే నిదర్శనం. గ్రామీణ మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని సీనియర్‌ గైనకాలజిస్టులు చెబుతున్నారు. ప్రాణహాని లేకున్నా వీటివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, తిరిగి మాతృత్వం పొందే అవకాశాలను పూర్తిగా తుడిచిపెడుతున్నారని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూలాలు వదిలేశారు?!

గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న బాల్య వివాహాలే ఈ సమస్యకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆడపిల్లలకు 17 ఏళ్లకే వివాహాలు 20 ఏళ్లు కూడా నిండకుండానే 2-3 కాన్పులు అవుతుండడంతో 24 ఏళ్లకే తెల్లబట్ట, క్రానిక్‌ సిర్వో సెర్విటిస్‌, బల్కీ యుటిరస్‌, పెల్వీ ఇంప్లిమెంటరీ డిసీజ్‌ (పీఐడీ) తరహా సమస్యలు పెరుగుతున్నాయి. విద్యాబోధన, ఆరోగ్యంపై సరైన అవగాహన కలిగిస్తే వీటిని తేలిగ్గా అరికట్టవచ్చు. కానీ పీహెచ్‌సీల స్థాయిలో చిన్నచిన్న జాగ్రత్తలు గాలికొదిలేసి సమస్యలు పెద్దవయ్యాక ఆపరేషన్లకు తెగబడితే ఏం ప్రయోజనం?!. ఇటువంటి కేసులు తరచుగా బయటపడుతున్నా ఉన్నతాధికారులు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలపై ఎటువంటి కఠినచర్యలూ తీసుకోకపోవడం మరింత అలక్ష్యానికి హేతువవుతోంది.

No comments:

Post a Comment