Saturday, December 27, 2008

పేరుకే ధర్మాసుపత్రి ... మందులు మాత్రం అడగొద్దు!!

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26:
ఉస్మానియా పేరుకే ధర్మాసుపత్రి...మందులు మాత్రం బయట కొనుక్కోవాల్సిన దుస్థితి. అధునాతన వైద్య పరికరాల ద్వారా చేస్తున్న రోగ నిర్థారణ పరీక్షలకు రోగుల నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాటిని యూజర్‌ ఛార్జీలు అనకుండా ఫిల్‌‌మ రేట్లు అంటూ పేరు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. తమ వాళ్లయితే మందులు ఫ్రీగా లభిస్తాయి. లేదంటే బయట కొనుక్కోవాల్సిందే. అత్యవసర మందులు.... ఇంజెక్షన్లు ఇలా చాలావాటి కోసం రోగుల బంధువులకు ప్రిస్క్రిప్షన్‌ రాసి బయట నుంచే తెప్పిస్తున్నారు.ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు మెడికల్‌ షాపుల వారు తమ శక్తిమేరకు రేట్లు పెంచి రోగులను దోచుకుంటున్నారు. దీంతో నిరుపేదల జేబులు గుల్లవుతున్నాయి. ఇక ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత వల్ల రోగులతో పాటు నర్సులు, కిందిస్థాయి ఉద్యోగుల వరకు అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో మందులు, డిస్పోజబుల్‌‌సకు బడ్జెట్‌ రూ. 86 లక్షలు కేటాయించింది. ఈ నిధులు సక్రమంగా వినియోగిస్తే ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికీ ఉచితంగా మందులివ్వచ్చు. కానీ ఆచరణలో అలా జరగడం లేదు.
జోరుగా కమిషన్‌ దందా
రోగులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైతే ఔట్‌ పేషెంట్‌ కన్సల్టేషన్‌ వరకు బాగానే జరుగుతున్నాయి. మందులకు మాత్రం ప్రిస్క్రిప్షన్‌ రాసిస్తున్నారు. `మందులు ఇవ్వరా?' అని ఎవరైనా అడిగితే జ్వరం తగ్గేందుకు రెండు రోజులకు సరిపడ పారాసిటమాల్‌, విటమిన్‌ టాబ్లెట్లతో సరిపెట్టేస్తున్నారు. మిగిలిన మందులు స్టాక్‌ లేవనీ, బయటే కొనుక్కోవాలని సూచిస్తున్నారు. చిత్రంగా ఆస్పత్రి ఆవరణలోని ప్రైవేటు మెడికల్‌ షాపుల్లోనే ఈ మందులు దొరుకుతున్నాయి. మెడికల్‌ షాపు వ్యాపారులు వీటినే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అక్కడి షాపు యాజమాన్యాలకు, డాక్టర్లకు ఇదొక ఉభయతారక వ్యాపారంగా తయారైంది. ఇందులో డాక్టర్లకు కొంత కమిషన్‌ ఉంటుందని కిందిస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ అపరేషన్లు చేయాల్సిన సమయంలో కావలసిన ఇంజెక్షన్లు, మందులకు కూడా ఇలాగే జరుగుతోంది. అత్యవసరం కావడంతో మందుల ధరలు ఎక్కువా? తక్కువా? అన్న ఆలోచన లేకుండా రోగుల బంధువులు కొనేస్తున్నారు. ఇవే మందుల ధరలు బయట మెడికల్‌ షాపుల్లో తీసుకుంటుంటే తక్కువ ఉంటున్నాయి. ఎమ్మార్పీ కన్నా రూ. 20-30 ఎక్కువ రేట్లతో ఉస్మానియాలో మందులు అమ్ముతున్న ఘటనలు అడపాదడపా వెలుగు చూస్తున్నాయి. కానీ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) పర్యవేక్షణ కొరవడడంతో ఈ అక్రమాలు యధేచ్చగా సాగుతున్నాయి. ఈ సమస్యలతో ఉస్మానియాలో ఉచితంగా వైద్యం అందుతుందని వస్తున్న పేద రోగుల వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
రకరకాల పేర్లతో డబ్బు వసూలు
కోట్ల రూపాయలు వెచ్చించి ఉస్మానియాలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలు రోగులకు అందుబాటులో లేవు. సీటీ స్కాన్‌, ఎమ్మారై, ఇసీజీ ఇలా ఏ మెడికల్‌ టెస్టులైనా ఫిల్‌‌మ రేట్ల పేరుతో రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఉస్మానియాలో రోజుకు కనీసం 50 సీటీ స్కాన్‌లు, 10 ఎమ్మారై స్కాన్‌లు అవుతున్నాయి. ఇవేవీ ఉచితం కాదు. గుండెజబ్బు, మెదడు, నరాల సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అసవరమైన అన్ని మెడికల్‌ టెస్టులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య శ్రీ రోగుల విషయంలో చిన్న సమస్య అయినా హైలెట్‌ అవుతుండడంతో వారికి మాత్రం ఈ ఛార్జీలను మినహాయించారు. సీటీ స్కాన్‌, ఎమ్మారై తదితర రిపోర్టులు కావాలంటే రూ. 300- 500 చొప్పున డబ్బులు కట్టి ఫిల్ములు తీసుకోవాల్సిందే. కానీ మంత్రులు, వైద్య శాఖ అధికారులు మాత్రం ఉస్మానియా సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెడికల్‌ టెస్టులు చేస్తున్నామని గొప్పగా చెబుతారు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులకు వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.
`డీఎంఇ' మార్గదర్శకాలు!
ఉస్మానియాలో ఎమ్మారై అందుబాటులోకి వచ్చాక ఉచిత వైద్య సేవలు అందుతాయని భావించిన పేద రోగులకు నిరాశే ఎదురైంది. వివిధ వర్గాల నుంచి ఎంతమేరకు యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలన్న నిబంధనలపై డీఎంఇ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన రోగులు ఎమ్మారై తీసుకుంటే రూ. 500, మామూలు రోగులకు రూ. 1500, ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చే రోగులకు రూ. 2500 వరకు వసూలు చేయాలని డీఎంఈ నుంచి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలందాయి. ఎమ్మారై ఏర్పాటు చేయక ముందు సీటీ స్కాన్‌ ఫిల్‌‌మకు రూ. 300 మాత్రమే వసూలు చేసేవారు. కానీ డీఎంఈ సూచనల తరువాత రూ. 300 బదులు రూ. 500 వసూలు చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వారంతా పేదవారే అయినా ఫిల్ములు జారీ చేయాలంటే డబ్బులు తప్పనిసరని రేడియాలజీ విభాగం ఉద్యోగులు చెబుతున్నారు.
నర్సులకు గదుల్లేవు!
గత ఏడాది జూలైలో ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఏంసీఐ) తనిఖీలు జరిగినప్పుడు ప్రమాణాల పేరుతో నర్సులకిచ్చిన గదులను డాక్టర్లు ఆక్రమించుకున్నారు. నిజానికి అప్పటి దాకా వారికి కూడా రూములు లేవు పాపం. ఇక తనిఖీలు పూర్తయ్యాక కూడా అక్కడే తిష్టవేయడంతో నర్సులు కారిడార్లు, వార్డుల్లో ఉండే టేబుళ్ల దగ్గరా సెటిలయ్యారు. నర్సులకు కేటాయించిన `సీఎస్‌జీ బ్లాక్‌' ఏ క్షణంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. హెరిటేజ్‌ బిల్డింగ్‌ అన్న సాకుతో దీనిని కూలగొట్టి కొత్త భవనాలు నిర్మించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. నర్సింగ్‌ కాలేజీ పక్కన బేగం బజార్‌ వైపు 10 ఎకరాలకు పైగా ఉన్న ఖాళీ స్థలంలో నర్సుల కోసం కొత్త భవనం కట్టాలని ఇప్పటికే పలుమార్లు సర్కారుకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. లేడీ డాక్టర్లు, నర్సులకు డ్రస్‌ మార్చుకునేందుకు గదులు లేవు. కూర్చుని భోం చేసేందుకు సరైన క్యాంటీన్‌, రెస్‌‌ట రూం సైతం లేవు. ఇదీ ఉస్మానియాలో మౌలిక వసతుల పరిస్థితి. ఉద్యోగుల పరిస్థితులే ఇలా ఉంటే రోగులకు వసతులు ఎలా ఉంటాయో ఇక ఊహించుకోవచ్చు. ఆ షెడ్‌ 20 మందికి మించి సరిపోదు!ఉస్మానియా ఆస్పత్రిలో నిత్యం సగటున 1500 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరికి సహాయకులుగా వచ్చిన వారిలో చాలా మంది ఆస్పత్రి ఆవరణలో సరైన వసతులు లేక నానా అగచాట్లు పడుతున్నారు. రోజుకు కనీసం 300 మంది ఆస్పత్రి పరిసరాల్లో చెట్లకింద, కారిడార్లు, మెట్లమీద ...ఇలా ఎక్కడో ఓ చోట విశ్రమిస్తున్నారు. 27 ఎకరాల సువిశాల ఉస్మానియా ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం నామమాత్ర రుసుముతో వసతి సౌకర్యాలు కల్పించే విధంగా ఓ ప్రత్యేక భవనం కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఇంతవరకు ఎందుకు రాలేదో అధికారులకే తెలియాలి. రోగులతో పాటు వచ్చిన వారు విశ్రాంతి తీసుకునేందుకు ఓ చిన్న షెడ్డుంది. ఎక్కువలో ఎక్కువ 25 మందికి సరిపోతుంది. అందులో సగం వంటశాలకిచ్చేశారు. ఈ సమస్యలు తెలిశాయో ఏమో రోగుల సహాయకులకు రోజువారీ అద్దెతో గదులిచ్చేందుకు ఓ ధార్మిక సంస్థ ముందుకొచ్చింది. ఆస్పత్రి పక్కనే ఉన్న `రామనాథ్‌ ఆశ్రమం'లో రోగుల సహాయకులకు రోజుకు రూ.20- 40వరకు తీసుకుని గది అద్దెకిస్తున్నారు. ఓ సాధారణ స్వచ్ఛంద సంస్థకున్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం.

No comments:

Post a Comment