Saturday, February 7, 2009

నిమ్‌స్ లొ రోగుల దైన్యం

* సమ్మెతో వైద్యసేవలకు విఘాతం
* ఆగిపోయిన ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు
* సీటీ స్కాన్, ఎం ఆ ఐ లకు బ్రేక్


ఇంటికెళ్లేందుకు డబ్బుల్లేవు...పదో పరకో ఇవ్వండి.. బాబూ!... ఇదేదో అడుక్కోవడంలో వచ్చిన కొత్త టెక్నిక్‌ కాదు. నిమ్‌‌స ఎదుట... ఓ రోగి బంధువుల దైన్యం! నాడీ సంబంధ వ్యాధికి చికిత్స చేస్తారని... `ఆరోగ్య శ్రీ' కార్డు పట్టుకొని ఇక్కడికొస్తే ఆసుపత్రిలో చేర్చుకోలేదు. కారణం... రెండు వారాలుగా నర్సులు, వైద్య సిబ్బంది, ఉద్యోగుల సమ్మె. నిమ్‌‌సలో అలుముకున్న కర్కశ నిశ్శబ్దానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఉదంతం సజీవ సాక్ష్యం.



హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (మేజర్‌న్యూస్‌) :


గత 15 రోజులుగా సాగుతున్న నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్‌‌స) ఉద్యోగుల సమ్మె రోగుల ప్రాణాల మీదకు తెచ్చింది. కనీసం 3000 మంది రోగులతో అనునిత్యం రద్దీగా కనిపించే టీచింగ్‌ ఆసుపత్రి ఇప్పుడు బోసి పోయింది. అత్యవసర సేవలు, వైద్య పరీక్షలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక ఆరోగ్య శ్రీ సేవలైతే అడ్రస్‌ లేకుండా పోయాయి. ఆరోగ్య శ్రీ, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) పరిధిలో చేయాల్సిన శస్త్ర చికిత్సలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. నిమ్‌‌సలోని 870 పడకల్లో 50 శాతానికి పైగా ఆరోగ్య శ్రీ రోగులే భర్తీ అవుతున్నారు. ఇక డయాలసిస్‌ సేవలు, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, ఎక్‌‌స రే పరీక్షలు ఆగిపోయాయి. 1400 మంది నర్సులు, వైద్య సిబ్బంది, ఉద్యోగుల సమ్మెకు దిగడంతో ఆసుపత్రిలోని ఇన్‌పేషెంట్ల సంఖ్య రెండు వేల నుంచి 500 మందికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం, ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్‌‌స)లో వర్తింపజేసిన ఆరో వేతన సవరణ తమకు కూడా వర్తింపజేయాలని నిమ్‌‌స ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఈ సమస్యలు తలెత్తాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు, సంస్థ డైరెక్టర్‌కు ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చానా ఉద్యోగుల సమస్యలను అలక్ష్యం చేయడం వల్లే ఆందోళనకు దిగినట్లు నిమ్‌‌స జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు చెబుతున్నారు.



`ప్రైవేటు'కు సిఫారసులు



నర్సులు, క్లాస్‌ - 4 ఉద్యోగులు లేకపోవడంతో రోగులకు సేవలు అందవని, రద్దీని తట్టుకోలేమని భావిస్తున్న డాక్టర్లు దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలకు వెెళ్లమని రోగులకు సలహాలిస్తున్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థినులతోనే రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు.



పే స్కేలుకు అడ్డుపుల్లలు!



ప్రభుత్వానికి నిమ్‌‌స ఉన్నతస్థాయి అధికారి తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లే తమకు వర్తించాల్సిన కొత్త `పే స్కేలు' అమలు కావడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న టీచింగ్‌ ఆసుపత్రులు, ఎయిమ్‌‌సలలో ఆరు నెలల క్రితమే ఆరవ వేతన సవరణ (పీఆర్‌సీ-6) అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధి, స్థాయిలో ఉంది కనుక నిమ్‌‌స ఉద్యోగులకు కూడా ఎయిమ్‌‌స తరహాలోనే అన్ని సౌకర్యాలు వర్తింపజేయడం ఆనవాయితీనే. కానీ నిమ్‌‌స డైరెక్టర్‌, ప్రభుత్వం దీనికి అడ్డం తిరిగింది.



8 కోట్లు భారమా?!



నిమ్‌‌సలోని 1400 మంది నర్సులు, వైద్య సిబ్బంది, ఉద్యోగులకు ఆరవ పీఆర్‌సీ సిఫారసుల ప్రకారం పే స్కేలు వర్తింపజేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడే అదనపు భారం ఏడాదికి రూ. 8 కోట్లు మాత్రమే. ఇందులో పనిచేసే డాక్టర్లను కూడా కలిపితే రూ. 18 కోట్లు అవుతుంది. ఆరోగ్య శ్రీతో పాటు మిగిలిన పథకాలకు ఖర్చుచేస్తున్న వందల కోట్లతో పోల్చితే తమ జీతాలకయ్యే ఖర్చు చాలా తక్కువని ఉద్యోగులు వాదిస్తున్నారు.



దారిమళ్లుతున్న నిధులు!



ఉద్యోగులకు సదుపాయాలు కల్పించేందుకు ఉపయోగపడాల్సిన నిధులు దారిమళ్లుతున్నాయి. బీబీ నగర్‌లో నిమ్‌‌స యూనివర్సిటీ నిర్మాణ పనుల కోసం నిమ్‌‌స ఆదాయంలోని రూ. 70 కోట్లు మళ్ళించినట్లు సమాచారం. నిమ్‌‌స వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 120 కోట్లు రావాలి. ఇందులో ఇప్పటివరకు నిమ్‌‌స వర్శిటీకి ఎంత మొత్తం మంజూరు చేశారో సరైన లెక్కలు లేవు. నిమ్‌‌స ఆదాయంతో ఉద్యోగులకు చెల్లించాల్సిన ఎల్టీసీ, మెడికల్‌ రీఎంబర్‌‌సమెంట్‌ తదితర సౌకర్యాలన్నీ అటకెక్కాయి. నిధులు లేవన్న సాకుతో వీటిని నాలుగు నెలలుగా ఆపేశారు. ఇప్పటికైనా నిమ్‌‌సలోని ఉన్నతాధికారుల పెత్తనం, నిధులు మళ్ళింపులు ఆపకపోతే ఉద్యోగులకు ప్రయోజనాలు, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా పోతాయి.

No comments:

Post a Comment